కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరగా,తాజాగా కర్ణాటక,తెలంగాణ కూడా అదే దిశగా వెళుతున్నాయి.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పులపై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనం. కర్ణాటకలో గ్యారెంటీల అమలుకు భారీగా రుణాలు తెచ్చుకుంటున్నారని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ మండిపడ్డారు.ఆయన కర్ణాటక ప్రభుత్వ విధానాలను ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.రాష్ట్ర భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఆర్థిక స్థితి బలహీనంగా మారిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదమైంది.ఉద్యోగులకు జీతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి రూ.4,000 కోట్లు రుణం తీసుకున్నట్టు వెల్లడించారు.డీఏ చెల్లింపులపై కూడా ఆంక్షలు విధించారు.ఈ పరిణామాలపై జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.తెలంగాణ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్రం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్ణాటకలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూలోటు రూ.21,000 కోట్లు దాటిందని, వచ్చే ఏడాది రూ.19,000 కోట్లు మించవచ్చని అంచనా.పన్నులు పెంచుతూ ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రజలకు ఉచిత పథకాల ఆశ చూపి, రాష్ట్రాలను అప్పుల్లో ముంచడమే కాంగ్రెస్ పాలన లక్షణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

