అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు స్టే విధించింది. బాలిక ఛాతిపై చేతులు వేయడం, పైజామాను తొలగించే ప్రయత్నాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని హైకోర్టు మార్చి 17న తీర్పు ఇచ్చింది. దీనిపై ‘వియ్ ది వుమెన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది.సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. “ఇది ఒక న్యాయమూర్తి సున్నితత్వ లోపానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, తీర్పును రిజర్వ్ చేసిన నాలుగు నెలల తర్వాత విడుదల చేయడం మరింత ఆందోళన కలిగించిందని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. సాధారణంగా ఈ దశలో స్టే ఇవ్వడానికి సంకోచిస్తామని ధర్మాసనం పేర్కొన్నప్పటికీ, తీర్పులోని 21, 24, 26 పేరాల్లో ఉన్న పరిశీలనలు చట్ట విరుద్ధమని, అమానవీయంగా ఉన్నాయని పేర్కొంది.ఈ కేసులో 2021లో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతంలో ఓ 11 ఏళ్ల బాలికను ఇద్దరు యువకులు అసభ్యంగా వేధించారు.దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.హైకోర్టు తీర్పు సమాజంలో తప్పుడు సంకేతాలు పంపుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును నిలిపివేసింది.