ఎంతో మనోధైర్యంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు ఇటీవలే భూమికి సురక్షితంగా చేరిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో తమ తమ అనుభవాలను వీరు పంచుకున్నారు. రోదసి నుండి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు స్పందిస్తూ సునీత చాలా అద్భుతంగా కనిపించిందని అన్నారు. తనలో భారత్ మూలాలు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఇక తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత వివరించారు. హిమాలయాలు అత్యద్భుతం అని చెప్పారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుంచి వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పని చేసేవని పేర్కొన్నారు. తన మూలాలు ఉన్న భారత్ కు వచ్చే అంశం గురించి మాట్లాడారు. తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలనుకుంటున్నానని అన్నారు. భారత దేశంలో ఉన్న బంధువులు, ప్రజలతో మాట్లాడాలని ఉందని వారితో తన అనుభవాలను పంచుకోవాలని ఉందని అన్నారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కొనియాడారు.
భారత్ అద్బుతం… అంతరిక్ష అనుభవాలు పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్
By admin1 Min Read