డీఎంకే పార్టీ సీనియర్ నేత ఏ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పార్టీ కార్యకర్తలకు ఆయన కుంకుమ బొట్టు పెట్టుకోవద్దని, చేతికి కంకణం కట్టుకోవద్దని సూచించారు.డీఎంకే పార్టీకి అనుసంధానమైన ధోతీ ధరించిన సమయంలో ఈ అలంకరణలను నివారించాలన్నారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా,ఆయన మాటలపై వివాదం రాజుకుంది.ఏ రాజా తన వ్యాఖ్యల్లో దేవుడి నమ్మకాలపై వ్యతిరేకత లేదని,కానీ బొట్టు, కంకణం ధరించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల్లా కనిపించే అవకాశం ఉందని తెలిపారు.స్టూడెంట్ వింగ్ కార్యకర్తలు కనీసం ఈ నియమాన్ని పాటించాలని సూచించారు.పేరెంట్స్ విభూతి పెడితే దాన్ని అంగీకరించొచ్చని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు స్పందించారు. ఏ రాజా వ్యక్తిగత అభిప్రాయంగా ఈ వ్యాఖ్యలు చేశారని, డీఎంకే పార్టీ దీనికి బాధ్యత వహించదని స్పష్టం చేశారు.ఇదివరకూ కూడా ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.ఈ విషయంపై తమిళనాడు బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.హిందూ మత విశ్వాసాలను కించపరిచేలా డీఎంకే నేత వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది.మత సామరస్యం గురించి మాట్లాడే డీఎంకే హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తోందని ప్రశ్నించింది.

