హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.వన్యప్రాణుల ప్రాణాలకు హాని చేస్తూ, ప్రకృతిని నాశనం చేయడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు.హరియాణాలోని యమునా నగర్‌లో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పాలనను మర్చిపోవద్దని, 2014కు ముందు దేశాన్ని అంధకారంలోకి నెట్టిన విధానాలు ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని అన్నారు.హిమాచల్ ప్రదేశ్‌లో పనులు ఆగిపోయాయని,కర్ణాటకలో అవినీతి నంబర్‌వన్ స్థాయికి చేరిందని ఆరోపించారు.
తెలంగాణలో గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసి, అడవుల్లో బుల్డోజర్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేస్తోంది, వన్యప్రాణులకు హాని కలిగిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే, కాంగ్రెస్ అటవీ సంపదను నాశనం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి హామీల అమలుపై శ్రద్ధ వహించకుండా ప్రకృతిని ధ్వంసించడమే ముఖ్యంగా చేసుకున్నదని ప్రధాని అన్నారు.