తమిళనాడు ప్రభుత్వం,గవర్నర్ ఆర్.ఎన్.రవి మధ్య బిల్లుల ఆమోదంపై తలెత్తిన విభేదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం స్వయం ప్రతిపత్తిపై దృష్టి పెట్టింది.ఈ లక్ష్యంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం.నాగనాథన్ సభ్యులుగా ఉన్నారు.రాష్ట్రానికి స్వయం నిర్ణయాధికారం లభించేలా చర్యలు ఏవి అవసరమో ఈ కమిటీ రెండేళ్లలో నివేదిక సమర్పించనుంది.
తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, తిరిగి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏప్రిల్ 8న ఇచ్చిన ఈ తీర్పులో, గవర్నర్ ఈ చర్య ద్వారా ఆర్టికల్ 200ను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. రాజ్యాంగ ప్రకారం, శాసనసభ మళ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఇది న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజయంగా మారింది.సుప్రీంకోర్టు తీర్పుతో ఉత్సాహితమైన తమిళనాడు ప్రభుత్వం ఏప్రిల్ 11న పది చట్టాలను గెజిట్‌లో నోటిఫై చేసింది.
గవర్నర్ లేదా రాష్ట్రపతి అనుమతి లేకుండానే ప్రభుత్వ గెజిట్‌లో చట్టాలను ప్రకటించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.ముఖ్యంగా, తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్ట సవరణలు,ఫిషరీస్ యూనివర్సిటీ పేరు మార్పు,వైస్ ఛాన్సలర్ల నియామక అధికారాల మార్పు వంటి కీలక చట్టాలు ఇందులో ఉన్నాయి.రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ అనుమతి అవసరం.కానీ ఆయన ఆమోదాన్ని నిలిపివేయడం,లేదా రాష్ట్రపతికి పంపడం వంటి అధికారాలు ఉన్నాయి. అయితే,ఒకసారి శాసనసభ తిరిగి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి.ఈ అంశం చుట్టూ నెలకొన్న చర్చలు,తాజా తీర్పులు రాష్ట్ర పాలనలో గవర్నర్ పాత్రపై కీలక దృష్టికోణాన్ని కలిగించాయి.తమిళనాడు నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా మారే అవకాశం ఉంది.