ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ లోని వాయు కాలుష్యంపై తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి కాలుష్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు ఢిల్లీలో ఉంటే అనారోగ్యం ఖాయమని అన్నారు. ఢిల్లీ, ముంబై నగరాలు రెడ్ జోన్ లో ఉన్నాయన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే అక్కడి ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్లు తగ్గుతుందని హెల్త్ రీసెర్చ్ ను ఉటంకించారు. ప్రజలు ఇప్పటికైనా ఇంధనం వినియోగాన్ని తగ్గించాలని సూచించారు . పర్యావరణానికి కూడా మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వ్యవస్థలలాగా ముఖ్యమైన విషయాల్లో ఒకటిగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. దాదాపుగా రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకుంటున్నామని వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర ఇంధనాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్న భారత్ రవాణా, విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాల్లో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించేందుకు దృష్టి సారిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్స్ వ్యయం 12% లోపు ఉంటే మన ఖర్చులు 16% వరకు ఉన్నాయని అన్నారు. 2026 చివరికల్లా సింగిల్ డిజిట్ కు తగ్గించేలా పని చేస్తామన్నారు.
ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
By admin1 Min Read