ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను తెలిపారు. ముఖ్యంగా ఈ భేటీలో రైతులకు, వారి అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. MSP కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు కేంద్రం కేటాయించినట్టు వివరించారు. ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, వారి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ పథకాన్ని కూడా ఆమోదించారు. గత 10-11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు MSP భారీగా పెంచినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం MSP పెంపును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందన్నారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లుతో పాటు అన్నదాతల పెట్టుబడిపై 50శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఏపీలోని బద్వేల్- నెల్లూరు ఫోర్ లైన్ హైవే అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ హైవే అభివృద్ధి చేయనుంది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టే ఈ కారిడార్ కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. అలాగే, ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది.
వరితో పాటు మొత్తం 14 ఖరీప్ పంటలకు క్వింటాల్ కు కనీస మద్దతు ధర(MSP) కేంద్రం పెంచింది. వీటిలో వరి సాధారణ, గ్రేడ్- ఏలకు రూ.69 పెంచగా.. జొన్నలు రూ. 328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175; కందిపప్పు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశెనగ రూ.480 పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436; కుసుమలు రూ.579; వలిశలు రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.
ఖరీఫ్ సీజన్ లో వరితో పాటు 14 పంటలకు MSP పెంపు… కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
By admin2 Mins Read