అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్న ‘విమాన ప్రమాద దర్యాప్తు మండలికి అతీతంగా ఈ కమిటీ స్వతంత్ర దర్యాప్తు చేపడుతుందని పేర్కొన్నారు. విమాన ప్రమాద ఘటనపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దుర్ఘటనపై విస్తృతకోణాల్లో కమిటీ సంపూర్ణంగా దర్యాప్తు చేస్తుంది. అన్ని భాగస్వామ్యపక్షాలు, నిపుణులతో చర్చించి నివేదిక ఇస్తుంది. ఇందు కోసం 3 నెలల గడువు పెట్టాం. బోయింగ్ 787 విమానాలపై ఇంకా ప్రత్యేక నిఘా ఏమైనా ఉంచాలా? అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మనవద్ద ఉన్న ఇలాంటి 34 విమానాలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని డీజీసీఏని ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ
By admin1 Min Read