రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై సుంకాలను మరింత పెంచుతానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ అమెరికా సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదని అన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదన్నారు. ఈసందర్భంగా సంప్రదాయాలకు ప్రత్యేక విలువలు ఉంటాయని, అవే చివరికి గుర్తింపు తెస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తును రూపొందించడంలో మనపై మనకు నమ్మకం ఉండాలన్నారు. మనలాంటి దేశాలకు, సంప్రదాయాలే నిజమైన బలాలని వ్యాఖ్యానించారు. మన దిగుమతులపై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా అయన మరోసారి సుంకాలను మరింత పెంచుతానని హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటన్నింటిని భారత్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే గణనీయంగా సుంకాలు పెంచుతానన్నారు. ఇక ట్రంప్ హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితుల కారణంగా దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
Previous Articleఇథనాల్ కలిపిన పెట్రోల్ తో ఎలాంటి సమస్యలు ఉండవు: కేంద్రం స్పష్టత
Next Article ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం