వాయు కాలుష్యం తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు సమష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆందోళన కలిగిస్తోన్న వాయుకాలుష్యం జాతీయ అత్యవసర పరిస్థితేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలను వెతకాలని సహచర ఎంపీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త ఝాతో కలిసి మాట్లాడిన వీడియోను రాహుల్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
వాయు కాలుష్యానికి సామాన్య ప్రజలే ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. చాలా మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉత్తరభారతంలో నెలకొన్న ప్రస్తుత వాయు కాలుష్య పరిస్థితుల వల్ల పర్యాటకం బాగా పడిపోయిందని విషపూరితంగా మారుతున్న వాతావరణాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కాలుష్య మేఘాలు వందలాది కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయని వాటిని తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దీని కోసం ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు, ప్రజలు, నిపుణులు అందరూ కలిసి సమిష్టిగా ముందుకు రావాలన్నారు. రాజకీయ విమర్శలు చేసుకునేందుకు ఇది తగిన సమయం కాదని అందరూ కలిసి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని సూచించారు.
వాయు కాలుష్యం పై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్: నివారణకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు
By admin1 Min Read