దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి సదస్సుకు విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు, కవులకు, రచయితలకు, వివిధ రంగాల ప్రముఖులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా భాషాభిమానంతో ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన వంగూరి ఫౌండేషన్, ఇతర ప్రముఖులకు అభినందనలు తెలిపారు. ఒక దేశ వైభవాన్ని, ఆ దేశంలో పుట్టిన సాహిత్యం ప్రతిబింబిస్తుందని సాహిత్యం మన ఘనమైన చరిత్రకు ప్రతిబింబిమని పేర్కొన్నారు. మనవైన సంప్రదాయాలు, విలువలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. తెలుగుకు సుసంపన్నమైన సాహిత్యం ఉంది. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకూ పరిణామానుక్రమంగా, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కిందని పేర్కొన్నారు. అవధానం వంటి ప్రక్రియలు మన భాష గొప్పతనానికి నిదర్శనం. అలాంటి మహోన్నత సాహిత్యాన్ని, మనవైన విలువలకు నెలవైన చరిత్రను యువతకు చేరువ చేసే ప్రయత్నాలు ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ఓ జాతి పరిణతికి అందులో వస్తున్న సాహిత్యమే ప్రతిబింబం. కవులు, రచయితలు, మేధావులు, విలేకరులు సైతం రాసే ముందు సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా రచనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా సాహిత్యంలో కూడా మార్పులు రావాలని ఇందు కోసం రచయితల చొరవ మరింత పెరగాలని అన్నారు.
సృజనాత్మకతకు, మానవీయ విలువలకు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే విధంగా నూతన పంథాలో రచనలు రావాలని ఆకాంక్షించారు.
ఓ జాతి పరిణతికి అందులో వస్తున్న సాహిత్యమే ప్రతిబింబం:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
By admin1 Min Read