విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.మొదటి పనులు చేపట్టడానికి వీలుగా ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు కూడా ఆమోదముద్ర వేసింది.ఈ మేరకు దీనిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి పంపించింది.ఆంధ్ర ప్రదేశ్ మెట్రోరైల్ ప్రాజెక్టుల రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి 100 శాతం ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన ‘క్లాజ్’ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రీ-ఆర్గనైజేషన్ యాక్ట్‌లో 13వ సెక్షన్‌లో విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపింది.ఈ మేరకు నిధులను నూరుశాతం కేంద్రమే భరించాలి.నూతన మెట్రో పాలసీలో రాష్ట్రాల్లోని ఏ నగరంలో అయినా అవసరమని భావిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే కేంద్రం మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉంటుంది.దీని ఫలితంగా రెండు మెట్రో ప్రాజెక్టుల పూర్తి ఖర్చు 42,362 కోట్ల భారం ఏపీ ప్రభుత్వానికి తగ్గనుంది.