ఈరోజు నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశాల ప్రారంభానికి ముందు విపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ముప్పేట దాడి చేశారు.ప్రజలు పదే పదే తిరస్కరించినవారు పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేశారు.కొందరు వ్యక్తులు చేతికింద మనుషులను పెట్టుకొని గూండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.వారి చర్యలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారని,సమయం వచ్చినప్పుడు వారిని మళ్లీ శిక్షిస్తారని అన్నారు.
ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ…సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన రెండు రోజుల తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజలు దాదాపు 80-90 సార్లు తిరస్కరించిన వారు పార్లమెంటులో చర్చలు జరగనివ్వడం లేదు అని అన్నారు.
మన రాజ్యాంగంలో పార్లమెంటు, మన ఎంపీలు ఎంతో ముఖ్యం…పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగాలి.పార్లమెంట్‌లో మంచి చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు.‘‘2025 కోసం దేశం సిద్ధమవుతోంది.ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి.భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం’’ అని తెలిపారు.