పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.తనపై నమోదైన రేప్ కేసును కొట్టివేయాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యువతి ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది.ఈ మేరకు యువకుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది.
కేసు విచారణ,తీర్పు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యాచారం మహిళలపై జరిగే చాలా హేయమైన చర్య…కానీ కొందరు మహిళలు తమతో సంబంధం కలిగిన పురుషుడిని వేధించేందుకు చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు.యువకుడు సమర్పించిన వాట్సప్ చాటింగ్‌లు,రికార్డింగ్స్ బట్టి చూస్తే ఇద్దరూ పరస్పరం అంగీకారంతోనే శారీరక బంధంలోకి ప్రవేశించినట్టు స్పష్టమవుతున్నది.స్త్రీలు చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పురుషులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పేందుకు ఈ కేసు స్పష్టమైన ఉదాహరణ అని చెప్పింది.

