కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని మల్లాయపాలెం గ్రామంలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీటిని పరిశీలించారు. అక్టోబర్ 14 న కంకిపాడు లో జరిగిన పల్లెపండుగ కార్యక్రమంలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థకు మరమ్మత్తులు చేపట్టి స్వచ్ఛమైన నీరు అందించాలని స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము కోరడంతో, సత్వరం చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించి, రూ. 3.8 కోట్ల నిధులు కేటాయించారు. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా దెబ్బ తినడంతో పంచాయతీకి రూ. 4 లక్షల ఖర్చు చేసి ఫిల్టర్ బెడ్లు మార్పించారు. 14 గ్రామాల పరిధిలో ఫిల్టర్ బెడ్ల మార్పు ప్రక్రియ పూర్తి అయిన క్రమంలో మల్లాయపాలెం రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. స్టోరేజీ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లతోపాటు- 14 గ్రామాల్లో మరమ్మతులకు ముందు, తర్వాత నీటి నమూనాలను పరిశీలించారు. శాసనసభ్యులు వెనిగెండ్ల రాము, మంత్రి కొల్లు రవీంద్ర , అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజక వర్గంలోని గొడవర్రు గ్రామంలో కూడా పవన్ పర్యటించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పవన్ కు స్వాగతం పలికారు. కంకిపాడు బస్టాండ్ నుండి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్ళే రహదారిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.3.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు ఈ పనుల నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
Previous Articleవరుస నష్టాల నుండి కోలుకుని లాభాల బాటలో సూచీలు
Next Article క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం…!

