భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన నాలుగో మ్యాచ్ లో భారత్ 15 పరుగులు తేడాతో విజయం సాధించి 3-1 ఆధిక్యంలోకి వెళ్లి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. హార్థిక్ పాండ్య 53 (30; 4×4, 4×6) ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శివమ్ దూబే 53 (34; 7×4, 2×6) కూడా దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ 30 (26; 4×4, 1×6), అభిషేక్ శర్మ 29 (19; 4×4, 1×6) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మద్ 3 వికెట్లు, జామి ఓవర్టన్ 2 వికెట్లు, అదిల్ రషీద్, బ్రిడన్ కార్సే ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. అయితే పరుగులు వస్తున్నా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. హ్యారీ బ్రూక్ 51 (26; 5×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. బెన్ డకెట్ 39 (19; 7×4, 1×6), ఫిలిప్ సాల్ట్ 23 (21; 4×4) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో హార్షిత్ రాణా 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అత్యద్భుతమైన ఆటతీరుతో భారత్ సిరీస్ సొంతం చేసుకుంది.
Previous Articleవిశ్వక్ సేన్ “లైలా” చిత్రంలో “కోయ్ కోయ్” సాంగ్..!
Next Article జాతీయ క్రీడల్లో ఏపీకి చెందిన కె. నీలం రాజుకు గోల్డ్