ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మూడో వన్డేలో కూడా భారత మహిళల జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన భారత్ నామమాత్రమైన మూడో మ్యాచ్ లో కూడా తడబడింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ (110) సెంచరీతో రాణించింది. కెప్టెన్ తహ్లియా మెక్ గ్రాత్ (56 నాటౌట్), ఆష్లే గార్డెనెర్ (50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటయింది. స్మృతి మంథాన (105) సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ సెంచరీతో రాణించిన భారత బ్యాటర్ స్మృతి మంథాన ఒక క్యాలెండర్ ఇయర్ లో 4 వన్డే సెంచరీలు చేసిన మొదటి మహిళా బ్యాటర్ గా చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఆమెకు ఇది 9వ సెంచరీ. ఇక హార్లీన్ డియోల్ (39) ఫర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డెనెర్ 5 వికెట్లు పడగొట్టింది. అలానా కింగ్ 2 వికెట్లు, మెగాన్ స్కాట్ 2 వికెట్లు, అన్నాబెల్ సదర్లాండ్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
ఉమెన్స్ క్రికెట్: 3-0తో భారత్ పై ఆస్ట్రేలియా విజయం: సెంచరీతో పోరాడిన స్మృతి మంథాన
By admin1 Min Read

