ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు అనుభవం రాళ్ళు, కొండలతో ఉన్న మాదాపూర్ ప్రాంతంలో ఆయనకు ఒక మహా నగరం కనిపించింది. ఈరోజు సైబరాబాద్ మహా నగరంగా మారింది అంటే ఆయన విజన్ కారణమని పేర్కొన్నారు. ప్రతీరోజూ మా కార్యాలయాల ముందుకు వివిధ వర్గాల ప్రజలు వచ్చి సమస్యలు చెప్తున్నారు. జీతాలు పెంచలేకపోతున్నాం, మొన్న సత్యసాయి జిల్లాలో కనీసం 30 కోట్లు జీతాలు గత ప్రభుత్వం ఇవ్వలేకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇవ్వగలిగామని తెలిపారు. జరిగిన తప్పులను సరిదిద్ది, రాష్ట్ర వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. దయచేసి అందరూ సహకారం అందించాలని కోరారు. ఉదాహరణకు కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టిన తరవాత కూడా ఇంకా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే తప్పు ఎవరిది? కలెక్టర్లు కఠినంగా వ్యవహరించి బాధ్యత తీసుకోవాలని సూచించారు. మీరు వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవస్థ బలహీనం అవుతుంటే చూస్తూ కూర్చుంటే కుదరదని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఎటువంటి అసమానతలు లేకుండా ప్రభుత్వ ఫలాలు అందించాలని, వివక్ష లేని పరిపాలన అందించే దిశగా పనిచేస్తున్నట్లు పేర్కొన్న పవన్ దీనికి కలెక్టర్లు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వ నాయకత్వం వైఫల్యం చెందుతుంటే అధికార యంత్రాంగం నో చెప్పకపోవడం వలన 10 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ఖజానాపై పడింది. దీనివలన ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని అన్నారు. దేశానికి ఐ.ఏ.ఎస్ అధికారులు ఎలా పనిచేయాలి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని అలా అందరూ పనిచేయాలి అని కోరుతున్నట్లు తెలిపారు.
వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read