తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు అందించేందుకు కీలక ముందడుగు వేసింది. ఈ ఏడాది ఉగాది పండుగ నుండి గద్దర్ చలనచిత్ర అవార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించే ఈ పురస్కారాలను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ తాజాగా సమావేశం అయింది. వీటి కోసం లోగోతో పాటు మిగిలిన అంశాలు, నియమ నిబంధనలపై కమిటీ ఈ సమావేశంలో చర్చించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ పురస్కారాలు అందిస్తామని తెలిపారు. మానవతా విలువలతో కూడిన చిత్రాలు, సాంస్కృతిక, విద్య, సామాజిక ఔచిత్యం కలిగిన సినిమాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.
Previous Articleపావలా శ్యామలకు పూరి జగన్నాథ్ తనయుడు సాయం
Next Article భారత్ – బంగ్లాదేశ్ రైతుల మధ్య ఘర్షణ