ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు హామీలను ప్రకటిస్తున్నాయి. ఇక ఇదివరకే ‘సంకల్ప పత్రా’ పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గర్భిణులకు రూ.21వేల ఆర్థికసాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను రూ.500కే ఇస్తామని తెలిపారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఇక నేడు తాజాగా మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈమేరకు ‘సంకల్ప పత్రా’ పార్ట్-2ను బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలుచేస్తామని అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తామని బీజేపీ తెలిపింది. భీమ్ రావ్ అంబేడ్కర్ స్టైఫండ్ పథకం కింద ఐటీఐలు పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాలలో టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటుచేస్తామని ఈసందర్భంగా అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సంకల్ప పత్రా’ పార్ట్-2 ను విడుదల చేసిన బీజేపీ
By admin1 Min Read
Previous Articleదేశంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సదుపాయం
Next Article ప్రతినెలా రూ.20తో మీ సిమ్ కార్డు నిలుపుకోండి..!