ఈశాన్యరాష్ట్రం మణిపుర్ లో రాజకీయంగా అనూహ్యపరిణామం చోటుచేసుకుంది.అక్కడి బీజేపీ సర్కార్‌కు జేడీయూ (JDU) షాక్ ఇచ్చింది.రాష్ట్ర ప్రభుత్వానికి నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ఈ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. మణిపుర్‌లో జేడీయూ పార్టీ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.బీజేపీకు తమ మద్దతు ఉండదని వెల్లడించారు.తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు.
మణిపుర్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది.అయితే ఎన్నికలు జరిగిన కొద్దినెలల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో బీజేపీకు 37 మంది సభ్యులున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ముగ్గురి మద్దతు ఉంది.అయితే ఇప్పుడు ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని సర్కార్‌కు ఎలాంటి ఢోకా లేదు.కానీ కేంద్రం, బిహార్‌లో ఎన్డీయే కూటమిలో కీలక పక్షమైన నీతీశ్ పార్టీ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతుల మధ్య ఘర్షణలతో మణిపుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అదే జేడీయూ తాజా ప్రకటనకు కారణంగా కనిపిస్తోంది.

