అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ట్రంప్ ప్రభుత్వ వ్యయాలు తగ్గించే పనిపై దృష్టి సారించారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ దేశంలో పన్నులు వసూళ్లు చేసే ఇంటర్నెల్ రెవెన్యూ సర్వీస్‌లో కొత్తగా చేరిన 90,000 మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపనున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ విషయాన్ని లాస్ వేగాస్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.‘‘వారిలో 88,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమో..లేదా నియమించుకొనేందుకు ప్రయత్నించడమో చేశాం.ఇప్పుడు వారిని తొలగించడమో..లేదా సరిహద్దులకు పంపడమో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.వారికి తుపాకులు ఇచ్చి బోర్డర్స్కు పంపడమే సరైన పని అనుకొంటా’’ అని వ్యాఖ్యానించారు.
ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే ఫెడరల్ ఉద్యోగుల నియామకాలను 90 రోజులపాటు స్తంభింపజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.జాతీయ భద్రత, ప్రజారక్షణ విభాగాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.కానీ, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగం మాత్రం ట్రంప్ కార్యవర్గం,డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ ఆదేశాలు ఇచ్చే వరకు ఆపేయాల్సిందే.