బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని ఇబ్బందిపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం వెనుకాడటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమె కుటుంబసభ్యుల పేర్లను చేర్చిన యూనస్ సర్కారు తాజాగా ఆమె కుమార్తె సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పదవి నుంచి తప్పించేలా పావులు కదుపుతోంది. ప్రస్తుతం సైమా డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఈమె ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నారు.వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన సైమా.. నాడీ సంబంధ రుగ్మతలపై పని చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆమెను ప్రాంతీయ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది.దీంతో 2024 జనవరిలో ఆమె బాధ్యతలు చేపట్టారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన యాంటీ కరెప్షన్ కమిషన్(ఏసీసీ) సంస్థ తన దర్యాప్తులో సైమాపై పలు ఆరోపణలు చేసింది. ఇక చర్యలు తీసుకోవడానికి వీలుగా ఆ సంస్థ పావులు కదుపుతోంది. ‘‘ఆమెను డబ్ల్యూహెచ్‌వో పదవి నుంచి తప్పించేందుకు ఏసీసీ ఇప్పటికే పలు చర్యలు తీసుకొంది. ఇందులోభాగంగా ఏసీసీ దేశంలోని వైద్య, విదేశాంగశాఖలకు లేఖలు పంపేందుకు అంతా సిద్ధం చేశాం’’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
మరోవైపు షేక్‌హసీనాను అరెస్టు చేయడానికి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే అంతర్జాతీయ మద్దతు కూడగడతామని వెల్లడించింది. ఈక్రమంలో అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ ఇప్పటికే అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇక ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ న్యూఢిల్లీకి పలు మార్లు లేఖలు రాసింది. హసీనా ప్రభుత్వం అనంతరం అధికారం చేపట్టిన మహమ్మద్ యూనస్ హయాంలో భారత్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.అంతేకాదు…పాక్‌తో దోస్తీ కోసం చూస్తుందని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.