హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జపాన్ ఆహ్వానించింది. ఈమేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు. ‘‘ట్రంప్ స్వయంగా అణుబాంబు బాధితుల అనుభవాలను తెలుసుకోవాలి. శాంతి కోసం వారు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోండి. అణ్వాయుధాల అమానవీయతపై అవగాహన పెంచుకోండి. ఈ ఆయుధాల నిషేధం దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
అమెరికా 1945వ సంవత్సరం ఆగస్టు 6, 9వ తేదీల్లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలతో దాడులు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ లొంగిపోయింది. హిరోషిమాలో 1,40,000 మంది, నాగసాకిలో 74,000 మంది మరణించారు. నాడు గాయాలతో బయటపడిన వారు కూడా ఆ తర్వాత రేడియేషన్ ప్రభావంతో చనిపోయారు.
ఈ బాంబు దాడులకు సంబంధించి అమెరికా ఏనాడు క్షమాపణలు చెప్పలేదు. కానీ, 2010లో తొలిసారి అమెరికా రాయబారి జాన్‌రూస్ మాత్రం హిరోషిమాలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. 2016లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాను సందర్శించారు. ఆ నగరానికి వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఆ తర్వాత 2023లో జోబైడెన్ పర్యటించారు. ట్రంప్ మాత్రం తన తొలివిడత పాలనలో ఆ నగరాలకు వెళ్లలేదు. గతేడాది మాత్రం ‘గాజా నిరసనలు’ ఎదురవుతాయన్న భయాలతో అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ దౌత్యవేత్తలు హాజరుకాలేదు.