పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ మేరకు కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు.గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా కలసి పోటీ చేసి అద్భుత విజయం సాధించింది.జగన్ ప్రభుత్వాన్ని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ నుండి 21మంది కూటమి సభ్యులు ఎంపీలుగా విజయం సాధించారు.ఈ విజయంతో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా కూటమి ఆవిర్భవించింది.
ఈ నేపథ్యంలోనే ఏపీకి కేంద్రం కొత్త పథకాల మంజూరు,నిధుల కేటాయింపునకు అధిక ప్రాదాన్యం ఇస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే రూ. 12 వేల కోట్లను మంజూరు చేసింది.తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు 3 విడతలుగా మరో రూ. 11,440 కోట్లను మంజూరు చేసింది.కాగా అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా హడ్కో ద్వారా సుమారు రూ. 18వేల కోట్లను రుణంగా కేటాయించింది.జాతీయ రహదారుల నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది.