ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ‘ఇన్ఫోసిస్’ గత ఏడాది అక్టోబరు క్యాంపస్ నియామకాల ద్వారా చేర్చుకున్న 700 మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపించినట్లు సమాచారం.దీని కోసం బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డులను ఉపయోగించిందని,ఎలాంటి ముందస్తు నోటీసులు,నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఉద్యోగులను తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఎన్ఐటీఈఎస్) మండిపడింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించడంతోపాటు ఉద్యోగులను బెదిరిస్తున్న ‘ఇన్ఫోసిస్’పై వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.
మెటా & గూగుల్ ఉద్యోగుల తొలిగింపు..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని తొలగించనున్నట్టు గత నెలలో ప్రకటించిన ‘మెటా’, ప్రధానంగా పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది అని తెలుస్తుంది.ఈ మేరకు 3,600 మందిపై వేటు వేయనుంది.వీరిలో 3 వేల మందిని ఈరోజు నుండి ఇంటికి పంపనున్నట్టు ఆ కంపెనీ నుండి లీకైన ఓ మెమో వెల్లడించింది.
అదే విధంగా మరొక టెక్ దిగ్గజం ‘గూగుల్’ నేరుగా ప్రకటించకపోయినప్పటికీ తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలోని ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్, ఫిట్బెట్ ఉత్పత్తుల సిబ్బందికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది.త్వరలో ప్రొడక్ట్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లోని దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.