నాగ్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.విహెచ్పీ చేసిన డిమాండ్లతో మొదలైన వివాదం చివరకు అల్లర్లకు దారితీసింది. రాళ్లు రువ్వడం,వాహనాలకు నిప్పు పెట్టడం వంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, భాష్పవాయువు ప్రయోగించారు.హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.కొన్ని షాపులు,నివాసాలు ధ్వంసం చేయబడ్డాయి.ఈ ఘటనల్లో 20 మంది గాయపడగా,15 మంది పోలీసు సిబ్బందే. హింసను ప్రేరేపించిన 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద జరిగిన ప్రదర్శనతో ఉద్రిక్తతలు మొదలైనట్లు సమాచారం.కొన్ని ప్రాంతాల్లో మత గ్రంథాలను కాల్చారనే వదంతులతో మరింత ఉద్రిక్తత పెరిగింది.ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను పెంచారు.శంభాజీనగర్ ఖుల్దాబాద్‌లోని సమాధిని సందర్శించేవారు గుర్తింపు పత్రాలు చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.పోలీసులు నగరంలోని కొత్వాలి, గణేశ్‌పేట్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ శాంతిని నెలకొల్పాలని ప్రజలను కోరారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హింసను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

