ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని లక్షలాది మంది విద్యార్థులు ఆశపడుతుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఎఫ్-1 విద్యార్థి వీసాల మంజూరుపై అమెరికా కఠిన నియంత్రణలు విధిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 41 శాతం వీసా దరఖాస్తులు తిరస్కరించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2013-14లో ఈ తిరస్కరణ శాతం 23 ఉండగా, గత ఏడాదికి ఇది రెట్టింపైందని తెలుస్తోంది. 2024 సంవత్సరంలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్-1 వీసాల సంఖ్య 38 శాతం తగ్గిందని నివేదికలు పేర్కొంటున్నాయి.కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో భారతీయ విద్యార్థుల వీసా మంజూరు తగ్గడం ఇదే తొలిసారి.
2024 తొమ్మిది నెలల్లో కేవలం 64 వేల మంది విద్యార్థులకు మాత్రమే వీసాలు మంజూరయ్యాయి.గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం గమనార్హం. అయితే తిరస్కరణకు గురైన దరఖాస్తులను దేశాల వారీగా విభజించి అమెరికా వెల్లడించలేదు. ఎఫ్-1 వీసా అనేది అమెరికాలో పూర్తి స్థాయి విద్యను అభ్యసించేందుకు విదేశీ విద్యార్థులకు ఇచ్చే అనుమతి. సాధారణంగా భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆగస్టు – డిసెంబర్ సెమిస్టర్‌లో ప్రవేశాలు పొందుతారు.ఈ కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

