ఉగ్రవాదులను వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోడీ అన్నారు. వారికి మద్దతుగా నిలుస్తున్న వారికి కూడా కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. బీహార్ లో తాజాగా ఆయన పర్యటించారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మధుబనీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడిని ప్రస్తావించారు. ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ప్రసంగం ప్రారంభించే ముందు పహాల్గాం మృతులకు నివాళులు అర్పించారు. ప్రధాని మోడీ సహా అందరూ మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రస్తావించారు. ఈ కష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాయపడిన వారిని ఆదుకునేందుకు అన్ని విధాల కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం టూరిస్ట్ లపై మాత్రమే జరిగిన దాడి కాదని భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుశ్చర్య అని పేర్కొన్నారు. కుట్రలో భాగమైన వారిని కఠినంగా శిక్షిస్తామని భారతీయులందరికీ హామీ ఇచ్చారు. ఉగ్రవాదులు వెన్నుముకను 140 కోట్ల మంది ప్రజలు విరిచేస్తారని అన్నారు. ఇక భారత్ కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ అండగా నిలిచారని కొనియాడారు. ఉగ్రవాదం తో భారత ఐక్యతా స్ఫూర్తిని దెబ్బకొట్టలేరని ఉగ్రవాదానికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు ప్రధాని మోడీ వార్నింగ్…కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
By admin1 Min Read