ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుచే పంటల ధ్వంసం… రైతు దుర్మరణంపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ సమీక్ష జరిపి ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవలే తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఒక కౌలు రైతు ఏనుగుల దాడిలో చనిపోవడం, తాజాగా పాకాల మండలం గానుగపెంటలో పంటలు ధ్వంసం చేసిన ఘటనలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏనుగుల మూలంగా ప్రజలకు, ప్రజల మూలంగా ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఏనుగుల మందలు అటవీ ప్రాంతాల నుంచి సమీప గ్రామాలకు అడవుల్లోకి వచ్చేస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అటవీ ప్రాంతాల్లో చేపట్టాలసిన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా ఎలిఫెంట్ కారిడార్ లో భాగంగా ఏనుగుల మందలు, ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోపాటు ఎలిఫెంట్ ట్రాకర్స్ సేవలు స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తక్షణమే ఏర్పాటు చేయాలని పీసీసీఎఫ్ ను పవన్ ఆదేశించారు.
ప్రజలకు, ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు… అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష
By admin1 Min Read