ఫెంగల్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి.చెన్నైలోని టి.నగర్ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది.కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాలు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది.3 రోజుల నుండి వణికిస్తున్న ఫెంగల్ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.మరోవైపు,తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది.తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి.తిరుచ్చెందూర్‌లో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు,ప్రైవేటు సంస్థలు కూడా మూతబడ్డాయి. సహాయ చర్యల కోసం 30 వేల మంది పోలీసులు,18 ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ, సముద్రతీ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఈరోజు చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
విమానాలు & రైళ్లు రద్దు :-
చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.చెన్నై నుండి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు.పలు సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా,చెన్నైవ్యాప్తంగా వరదనీరు చేరడంతో ఉపాధిలేని కూలీలు,హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశముందన్న కారణంగా చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని తమిళనాడు సిఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.