దగాపాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయ్యిందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారని జగన్ ట్వీట్ చేశారు. ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టిందని జగన్ పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు గారు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయమని అన్నారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు తెలిపారు.
ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకు వస్తే, ఆ ఉచిత పంటలబీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డుపడ్డం సబబు కాదన్నారు. నీటి సంఘాల ఎన్నికల అంశంలో అప్రజాస్వామికంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అందుకే అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీటి సంఘాల ఎన్నికలను ఖండిస్తూ, బహిష్కరించాలని వైయస్సార్‌సీపీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రైతుల తరఫున ఎప్పుడూ వారికి అండగా ఉంటూ వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది.
రైతులకు ఎప్పుడూ అండగా ఉంటూ వైసీపీ పోరాటం కొనసాగిస్తుంది: మాజీ సీఎం జగన్
By admin1 Min Read