అత్యంత వైవిధ్యమైన అందమైన వృక్ష సమూహం ‘మడ అడవులు’. ఉష్ణ, సమశీతోష్ణ మండల తీరప్రాంతాలలో సహజసిద్ధంగా వ్రేళ్ళు, మొదళ్ళు నీటిలో కనిపిస్తూ పైకి పచ్చని మొక్కలతో దట్టంగా పొదలలాగా కనిపించే వనాల సముదాయం మడ అడవులు. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల పచ్చగా కళకళలాడుతూ తీర ప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడగా నిలిచి ప్రకృతి విపత్తుల నుండి రక్షణగా నిలుస్తోంది ఈ పర్యావరణ వ్యవస్థ. ఉప్పు నేలలో ఆటుపోట్లకు చేరువలో పెరిగే ప్రత్యేక సామర్థ్యాన్ని ఇవి కలిగిఉంటాయి. వరదల నుండి, తుఫానుల తీవ్రత తగ్గించడంతో పాటు అలల ఉధృతి నుండి ఆ ప్రాంతన్ని నేల కోతకు గురికాకుండా కాపాడతాయి. సునామీ వంటి విపత్తుల సమయంలో భారీ నష్టం వాటిల్లకుండా రక్షిస్తాయి. నదీజలాలు సముద్రంలో కలిసేచోట చిత్తడి నేలలలో ఈ మడ అడవులు పెరుగుతాయి. ఈ అడవులు ఎన్నో జీవరాసులకు జీవనాధారముగా నిలుస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. నల్లమడ, తెల్లమడ, పొన్న,దుడ్డుపొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్లా, పొన్న మొదలైన అరుదైన వృక్షజాతులతో పాటు చిల్లంగి, కళ్ళతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికలు ఇక్కడ పెరుగుతున్నాయి. మొసళ్ళు, ఫిషింగ్‌క్యాట్స్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి నీటి జంతువులకు కూడా ఆవాసంగా నిలుస్తున్నాయి. అంతేకాక 120 రకాల పక్షులు, కీటకాలు తమ జీవనాన్ని వీటిలో సాగిస్తున్నాయి. సుందర్బన్ మడ అడవులు ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు. తమిళనాడులో ఉన్న పిచవరం మడ అడవులు ప్రపంచంలోనే రెండవ అతిపెద్దవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మడ అడవులు తూ.గో.జిల్లాలో కాకినాడ సమీపంలోని కోరంగి వద్ద విస్తృతంగా విస్తరించి ఉన్నాయి. తాళ్ళరేవు మండలంలోని కోరంగి నుండి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల తీర గ్రామాల్లో ఇవి విస్తారంగా ఉన్నాయి. ఇక్కడే కోరింగ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. కృష్ణా-బాపట్ల జిల్లాల పరిధిలో కూడా 5వేల హెక్టార్లలో వరకు ఈ అడవులున్నట్లు సమాచారం. ఇక ఎంతో ప్రత్యేకంగా కనిపించే ఈ సుందరమైన మడఅడవులను చూసేందుకు, విహరించేందుకు చాలా మంది ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పర్యాటకంగానూ ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. తీర ప్రాంతాలకు రక్షణగా నిలిచే ఈ అడవుల రక్షణ కూడా సవాలుగా మారింది. ఇవి అంతరించి పోకుండా కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మరిన్ని చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు.