ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు, సీనియర్ నటుడు షిహాన్ హుసైని (60) ఈరోజు ఉదయం బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.ఆయన మరణ వార్త సినీ, క్రీడా ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ప్రత్యేకించి, ఆయన వద్దే కరాటే శిక్షణ పొందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి, తన గురువు మరణం ఎంతో బాధించిందని తెలిపారు. హుసైని ఆరోగ్యం గురించి ఇటీవలే సమాచారం తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందించానని, కానీ అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి రావడం కలచివేసిందన్నారు.
అయితే చెన్నైలో హుసైని గారు కఠిన నియమాలతో కరాటే శిక్షణ ఇచ్చేవారని, మొదట తనకు శిక్షణ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, చివరికి ఒప్పుకుని బ్లాక్ బెల్ట్ స్థాయికి చేర్చారని గుర్తు చేసుకున్నారు. హుసైని గారి శిక్షణలో వేల మంది విద్యార్థులు కరాటేలో రాణించారని, ఆర్చరీ క్రీడా విస్తరణకు కృషి చేశారని చెప్పారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంగీతం, చిత్రకళ, నటన, స్పూర్తిదాయక ప్రసంగాల్లోనూ విశేష ప్రతిభ చూపారని కొనియాడారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని నిర్ణయించడం ఆయన విశాల దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. హుసైని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.