ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన అలసందలు మొలకెత్తాయి. అత్యల్ప గ్రావిటీ ఉండే వాతావరణంలో అవి నాలుగు రోజులలోనే మొలకెత్తాయి. స్పేస్ లో రాకెట్ ల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్) కోసం 2024 డిసెంబర్ 30న పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ద్వారా రెండు శాటిలైట్ లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా, ఆ రాకెట్ లోని పోయెమ్ -4 ద్వారా 24 పేలోడ్ లను ఆర్బిట్ లోకి పంపింది. ఇందులో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) అనే సాధనం కూడా ఉంది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరం. దీనిని కేరళ లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తయారు చేసింది. ఇందులో 8 అలసంద గింజలు ఉన్నాయి. అత్యల్ప గ్రావిటీ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం కోసం దీనిని చేశారు. వ్యోమగాములు తమ ఆహారాన్ని అంతరిక్షంలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అలసంద విత్తనాలు మొలకెత్తి, రెండు ఆకుల దశకు చేరుకునేవరకూ కొనసాగేలా ‘క్రాప్స్’ ప్రయోగాన్ని రూపొందించారు. ఈ ప్రయోగం తాలుకు చిత్రాన్ని ఇస్రో తాజాగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
Previous Articleఓవైపు ప్రశాంత్ కిషోర్ నిరసన…లగ్జరీ వ్యాన్ వివాదం
Next Article నమో భారత్ కారిడార్ ప్రారంభం