వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. గతేడాది ఎదుర్కొన్న పరిస్థితి దృష్ట్యా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తాగునీటి వృథాను అరికట్టేందుకు పటిష్టమైన విధానాలకు పూనుకుంది. తాగునీటిని వెహికల్స్ కడగడానికి, తోటలకు, నిర్మాణ పనులు, ఫౌంటెయిన్ లలో ఉపయోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పదేపదే అదే తప్పు చేస్తే అదనంగా మరో 5 వేలు జరిమానా అని, రోజుకు రూ.500 చొప్పున ఫైన్ విధిస్తామని స్పష్టం చేసింది. వాటర్ బోర్డ్ యాక్ట్ లోని సెక్షన్ 109 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బెంగళూరు నగరంలో ఈ వేసవిలో తాగునీటి కొరత ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాగునీటిని వృథా చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. వాటర్ బోర్డ్ కాల్ సెంటర్ నెంబర్ 1916 కు ఫోన్ చేసి చెప్పాలని పేర్కొంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని వాటర్ బోర్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఐ.ఐ.ఎస్.సీ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసింది. గతేడాది వేసవిలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈసారి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని నగరవాసులను కోరింది.
వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డ్ ముందస్తు చర్యలు..!
By admin1 Min Read