సురక్షితమని,ప్రకృతి సిద్ధమని ప్రచారం చేసే టూత్‌పేస్ట్ బ్రాండ్లలో ప్రమాదకరమైన లోహాల ముప్పు పొంచి ఉన్నదన్న నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. లీడ్ సేఫ్ మామా సంస్థ 51 టూత్‌పేస్ట్,టూత్ పౌడర్ ఉత్పత్తులపై థర్డ్‌పార్టీ ల్యాబ్‌లో చేసిన పరిశోధనల్లో షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి.పరీక్షించిన ఉత్పత్తుల్లో 90 శాతం వరకు సీసా, 65 శాతం వరకు ఆర్సెనిక్ కనిపించినట్లు తేలింది.పిల్లలు ఉపయోగించే టూత్‌పేస్టుల్లోనూ 47 శాతం వరకు పాదరసం, 35 శాతం వరకు కాడ్మియం ఉన్నట్టు గుర్తించారు.ఇవి తీవ్రమైన మానసిక,శారీరక సమస్యలకు దారి తీస్తాయని, చిన్న పిల్లల్లో మరణ ప్రమాదం కూడా ఉందని సంస్థ వ్యవస్థాపకురాలు తమారా రూబిన్ హెచ్చరించారు.
క్రెస్ట్,సెన్సోడైన్,కోల్గేట్,టామ్స్ ఆఫ్ మైనే, డాక్టర్ బ్రానర్స్ లాంటి ప్రసిద్ధ బ్రాండ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.”ఆర్గానిక్” లేదా “ఫ్లోరైడ్ రహిత” అంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, అసలైన సురక్షితత కలదు అని గ్యారంటీ ఇవ్వలేమని సూచిస్తున్నారు.ప్రజలు టూత్‌పేస్ట్ కొనేటప్పుడు వాటి లేబుల్స్ కంటే కూడా పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదివి,సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్న పిల్లల కోసం వాడే ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి.