కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమని అన్నారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ ఈనెల 4న రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు.ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం:రూ.5 లక్షల ఆర్థిక సాయం: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read