ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్లో కొత్త సంస్కరణలు తెచ్చింది.ఈ మేరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసింది.అయితే విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఇక నుండి కేవలం ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది.చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని,జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
కాగా సైన్స్,ఆర్ట్స్,భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని ఆయన చెప్పారు.ఈ మేరకు 2025-26 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్‍సీఈఆర్‍టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారని,నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షలకు సులభమవుతుందని శుక్లా పేర్కొన్నారు.ఈ సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తున్నామని స్పష్టం చేశారు.ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు.విద్యార్థులు,తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26లోగా సంస్కరణలపై సలహాలు,సూచనలు పంపాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా కోరారు.

