ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఫారో దీవులు ఇప్పుడు ప్రపంచ శక్తి రంగంలో నూతన శోధనలకు కేంద్రంగా మారుతున్నాయి.బ్రిటన్‌కు సమీపంగా ఉన్న ఈ చిన్న దీవులు,భూమి మీద నుంచే చంద్రుడి గురుత్వ శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయాలని వినూత్న ప్రాజెక్టును ప్రారంభించాయి.చంద్రుడి కారణంగా సముద్రాల్లో ఏర్పడే అలల శక్తిని విద్యుతుగా మార్చే ప్రయత్నం ఈ కార్యక్రమంలో భాగం.
అలల శక్తిని విద్యుతుగా మార్చే టెక్నాలజీ:-
ఈ ప్రాజెక్టులో భాగంగా ఫారో దీవులు ప్రముఖ బేరింగ్ తయారీ సంస్థ ఎస్కేఎఫ్ (SKF) మరియు సముద్ర శక్తి అభివృద్ధి సంస్థ మినెస్టో (Minesto)తో కలిసి పనిచేస్తున్నాయి. సముద్రపు గర్భంలో లూనా (LUNA) అనే గాలిపటాన్ని ఉపయోగించి అలల శక్తిని సేకరిస్తున్నారు. ఈ గాలిపటం ఎప్పటికప్పుడు అలలను పట్టుకొని నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్క లూనా పరికరం సుమారు 1.2 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.ప్రస్తుతం ఈ టెక్నాలజీ ద్వారా 200 గృహాలకు విద్యుత్ అందించగల సామర్థ్యం ఉంది. అయితే, ఫారో దీవుల ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదేమంటే 2030 నాటికి 200 మెగావాట్ల విద్యుత్‌ను అలల శక్తితో ఉత్పత్తి చేయడం. ఇది దీవుల్లోని సుమారు 50,000 మంది ప్రజలకు అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చే స్థాయిలో ఉంటుంది. అంతేకాదు, ఇది పునరుత్పాదక శక్తికి ప్రపంచంలో ఆదర్శంగా నిలుస్తుంది.
భవిష్యత్తులో సముద్ర శక్తి ప్రాధాన్యం:-
ఈ ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తున్న ఎస్కేఎఫ్ సంస్థకు భారత్‌లోనూ కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ సుజీత్ ప్రకారం, అలల శక్తి భారత తీర ప్రాంతాలకూ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్కల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో 80% శిలాజ ఇంధనాల ఆధారంగా ఉంది. కానీ సముద్ర శక్తి వనరులు 2050 నాటికి పెద్దపాటి వాటాను ఆక్రమించే అవకాశం ఉంది. ఇది లక్షలాది ఉద్యోగాలను కూడా సృష్టించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.