ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో రద్దీ పెరిగింది. దీక్షల విరమణ చివరిరోజు సందర్భంగా భారీ సంఖ్యలో భవానీలు తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల నుండి తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు . అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మ వారి పాదాలు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేశ ఖండన శాల వద్ద భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈరోజు పూర్ణాహుతితో దీక్షల విరమణ కార్యక్రమం పూర్తికానుంది.
Author: admin
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, జే.డీ.యూ నేత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, జే.డీ.ఎస్ నేత కేంద్ర మంత్రి హెచ్.డి.కుమార స్వామి తదితర నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు సాయం అందజేయనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. పుష్ప-2 చిత్రం నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ తరపున చెరో రూ.50 లక్షలు, అల్లు అర్జున్ తీర్పును రూ.కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈమేరకు సంబంధిత చెక్ లను ఎఫ్.డి.సీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. శ్రీ తేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని త్వరలో మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైవిధ్యమైన కధాంశాలున్న చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు సూర్య. ఈ ఏడాది ఆయన ‘కంగువా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన కొత్త చిత్రం టైటిల్ టీజర్ క్రిస్మస్ సందర్భంగా నేడు విడుదలైంది. ‘రెట్రో’ గా రానున్న ఈచిత్రం ఆయనకు 44వది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. సూర్య లుక్ ఆకట్టుకునేలా ఉంది. https://youtu.be/yE560j3AK3A?si=XhA7AaQbqjz2BhsD
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శాతం జయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘అటల్ సదైవ్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని మోడీ సహా ఎన్డీయే కూటమికి చెందిన పలువురు నేతలు నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. బలమైన, సంపన్నమైన మరియు స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్పంలో బలాన్ని నింపడానికి ఆయన దార్శనికత దోహదం చేస్తుందని మోడీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు, అటల్ బిహారీ వాజపేయి అభిమానులు తమ నివాళులు తెలుపుతున్నారు.
దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. భారతజాతి గర్వించదగిన నేత అని కొనియాడారు. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి చిరకాలం గుర్తుండిపోతుందని చంద్రబాబు ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ రూపకల్పన పై చర్చలు జరిపారు. జాతీయ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్ పర్సన్ అదిల్ జైనుల్ భాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కో వర్కింగ్ స్పేస్ అండ్ నెయిబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ డెవల్మెంట్ పై సీఎం చంద్రబాబు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నేతలు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 5 నుండి 4 రోజుల పాటు కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవాలకు హాజరవ్వాలని కోరారు.
వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో 211 పరుగులు తేడాతో విజయం సాధించి రికార్డు విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా జరిగిన రెండో మ్యాచ్ లో 115పరుగుల తేడాతో భారీ విజయం సాధించి 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. రెండో సారి తన అత్యధిక పరుగులను నమోదు చేసింది. హార్లిన్ డియోల్ 115 (103; 16×4) సెంచరీతో సత్తా చాటింది. ప్రతీక రావెల్ 76(86;10×4, 1×6), స్మృతి మంథాన 53 (47; 7×4, 2×6), జెమీమా రోడ్రిగ్స్ 52 (36; 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో కదంతొక్కడంతో భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో ఫ్లెచర్, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, డాటిన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక భారీ స్కోరు…
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర భారతంలో మరింత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. ఢిల్లీ మరియు సరిహద్దు ప్రాంతాల్లో నేటి ఉదయం (9.6 డిగ్రీల) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా మంచు పడుతుండడంతో వాహానదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ విమాన సర్వీసులకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. విమానాలు రాకపోకల గురించి ప్రయాణికులు ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈ.ఎస్.ఏ) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. వ్యోమగాములకు శిక్షణ, పలు అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలపై సహకారం కోసం ఈమేరకు అంగీకారం కుదిరింది. ఈరెండు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు వ్యోమగాములకు శిక్షణ, అంతరిక్ష ప్రయోగాలు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ISS)లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సౌకర్యాల వినియోగం, హ్యూమన్, బయోమెడికల్ పరిశోధన ప్రయోగాల అమలు, అలాగే విద్య, ప్రజా అవగాహన కార్యకలాపాలలో కలిసి పనిచేస్తాయి. ఆక్సియం-4 మిషన్ లో ఇస్రో గగన్ యాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగాములు ఉన్నారు. దీనికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు చేసిన కొన్ని ఆవిష్కరణలను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉపయోగించనున్నారు. ఈ ఒప్పందంతో భారత్ నిర్మించబోతున్న స్వదేశీ అంతరిక్ష కేంద్రం లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారం దొరుకుతుంది. ఈ ఒప్పందం ఇరుదేశాలకు చెందిన…
